మరో మైనర్ బాలుడిపై కిడ్నాప్ కేసు
– ప్రేమ పేరుతో మైనర్ బాలిక అపహరణ
– పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబీకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మరో మైనర్ బాలుడిపై కిడ్నాప్ కేసు నమోదయ్యింది.

మైనర్ బాలికను ప్రేమ పేరుతో కిడ్నాప్ చేసినట్లు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మైనర్ బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బషీరాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన రెండు కుటుంబాలు తాండూరు పట్టణంలో నివాసం ఉంటున్నాయి.

అయితే ఇరు కుటుంబాలలో ఉన్న మైనర్ బాలుడు, మైనర్ బాలికల మద్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. మైనర్ బాలుడు హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. గురువారం ఇద్దరు కలిసి పెళ్లి చేసుకునేందుకు హైదరాబాద్ వెళ్లిపోయారు.

తన కూతురు కనిపించడం లేదని బాలిక తండ్రి తాండూరు పోలీసులకు పిర్యాదు చేశారు. పట్టణ సీఐ పరమేశ్వర్, పోలీసు సిబ్బంది అప్రమత్తమై సెల్ ఫోన్‌ల సిగ్నల్ ఆధారంగా ఆచూకీని కనిపెట్టారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని తాండూరుకు తీసుకవచ్చారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బాలికను ప్రేమ పేరుతో కిడ్నాప్ చేశాడని తల్లి ఫిర్యాదు ఇవ్వడంతో మైనర్ బాలుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు సీఐ పరమేశ్వర్ వెల్లడించారు. బాలున్ని రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు.


