భళా.. బుల్లి రిపోర్టర్..!
– బడి బాధలపై వీడియో
– ఇద్దరు ఉపాధ్యాయులపై వేటు
– సోషల్ మీడియాలో వైరల్
దర్శిని డెస్క్: సమాజంలోని సమస్యలను ఎత్తిచూపుతూ వాటి పరిష్కారానికి మీడియా కృషి చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా విస్తరించిన తరువాత పెద్దల నుంచి చిన్నారులపై న్యూస్ రిపోర్టింగ్ ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ఓ పాఠశాల విద్యార్థి బుల్లి రిపోర్టర్‌గా మారి తన పాఠశాల సమస్యలను వెలుగులోకి తెచ్చాడు. అతను చేసిన రిపోర్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరలై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు పాఠశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉపాధ్యాయులపై వేటు వేయడంతో పాటు స్కూల్ సమస్యల పరిష్కారానికి ఆదేశించారు. వివరాలలోకి వెళితే.. ఝార్ఖండ్ గోడ్డా జిల్లాలోని భిఖియఛక్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 12 ఏళ్ల సర్పరాజ్ స్కూల్లో తిష్ఠవేసిన సమస్యలు చూసి విసుగెత్తిపోయాడు. తనతోపాటు తోటి విద్యార్థులు పడుతున్న బాధలను వెలుగులోకి తేవాలనుకున్నాడు.
https://twitter.com/Hemantg65153835/status/1555453671076671488?s=20&t=ByTWpg-71_3wVkFP9uee-g
వెంటనే టీవీ రిపోర్టర్‌గా మారి ఖాళీ ప్లాస్టిక్ బాటిల్‌ను ఓ కర్రకు తగిలించి దాన్నే మైక్‌గా మార్చుకున్నాడు. తోటి విద్యార్థిని కెమెరా మెన్‌గా తీసుకుని సెల్ ఫోన్‌లోనే పాఠశాలలో కలియతిరుగుతూ అక్కడి దుస్థితిని వివరించాడు. నిజమైన పాత్రికేయులకు ఏమాత్రం తీసిపోకుండా అతడు సమస్యలను వివరిస్తూ ‘‘మా పాఠశాలలో విద్యార్థులకు తాగడానికి నీరు కూడా లేదు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. మరుగుదొడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. తరగతి గదుల్లో పశువుల మేతను పడేస్తున్నారు. ఇక ఉపాధ్యాయులు విధులకు సరిగా రాకపోవడంతో విద్యార్థులు సక్రమంగా రావడం లేదు. ఇప్పుడు మధ్యాహ్నం 12.45 అవుతున్నా టీచర్లు స్కూల్‌కు రాలేదు’’ అంటూ తమ పాఠశాలలోని దుస్థితిని వివరించిన తీరు వీడియోలో మెప్పించాడు. విద్యార్థిని నువ్వు పాఠశాలకు ఎందుకు రోజూ రావడం లేదని అడగడం, అందుకు ఆ చిన్నారి స్పందిస్తూ బడిలో మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని, తాగునీరు కూడా లేదని చెప్పడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీనిపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి రజినీ కుమారి స్పందించారు. వెంటనే పాఠశాలకు సంబంధించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు. అక్కడి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుల్లి రిపోర్టర్‌ను భళా అంటూ మెచ్చుకుంటున్నారు.



