తాండూరులో ముస్లింల నిరసన
– రాజాసింగ్‌కు వ్యతిరేకంగా భారీ దర్నా
– పురవీదుల్లో నల్ల జెండాల ర్యాలీ
– అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు
– ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: హైదరాబాద్ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వాఖ్యలు తాండూరులో కల్లోలం రేపాయి. మహమ్మద్ ప్రవక్త, ఇస్లాంకు వ్యతిరేకంగా వాఖ్యలు చేయడంపై మంగళవారం ముస్లిం సోదరులు మండిపడ్డారు. వాఖ్యలను నిరసిస్తూ ముస్లిం పెద్దలు, సంఘాలు పురవీధుల్లో నల్ల జెండాల ప్రదర్శన చేపట్టారు. ర్యాలీగా పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్దకు చేరుకుని భారీ దర్నా నిర్వహించారు. రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రాజాసింగ్ ను జైల్లో వేయాలంటూ చిత్రపటాలను ప్రదర్శిస్తూ దగ్దం చేశారు. వికారాబాద్ జిల్లా అడిషనల్ రసీద్ చౌరస్తా వద్దకు చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడారు. సమన్వయం పాటించాలని.. శాంతిభద్రతలను సహకరించాలని సూచించారు. అనంతరం తాండూరు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ రసీద్తో పాటు పట్టణ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని హామి ఇవ్వడంతో ముస్లిం సోదరులు ఆందోళన విరమించారు.

అంతకుముందు పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ముస్లింల ద్వేషిగా అభివర్ణించారు. మతాల మద్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. మహ్మద్ ప్రవక్తా, ఇస్లాంకు వ్యతిరేకంగా వాఖ్యలు చేయడంతో ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్టేషన్లో పోలీసులు రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.


