కష్టపడండి.. కొలువులు కొట్టండి.!
– పోలీసు ఉద్యోగాలతో రాణించాలి
– సమస్యలు ఉంటే పరిష్కారానికి కృషి
– బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్
తాండూరు, దర్శిని ప్రతినిధి: పోలీసు ఉద్యోగాలకు ఇష్టపడి సిద్ధమైన అభ్యర్థులు.. కష్టపడి కొలువులు కొట్టాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ అన్నారు. తాండూరు పట్టణంలోని విలియమూన్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోలీసు ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులను శుభప్రద్ పటేల్ బుధవారం మార్నింగ్ వాక్ లో కలిశారు. అభ్యర్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సై, కానిస్టేబుల్ ఆర్హత పరీక్షలో రాణించిన విధంగా అభ్యర్థులు అందరు కొలువులు సాధించాలన్నారు. పట్టుదల, ప్రణాళికలతో లక్ష్యాలకు సిద్ధం కావాలన్నారు. పోలీసు ఉద్యోగాలను సాధించి తాండూరు ప్రాంతానికి పేరు తీసుకరావాలన్నారు. పోలీసు ఉద్యోగాలతో రాణించాలని ఆకాంక్షించారు. కొలువుల సాధనలో ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా అందించారు. అనంతరం అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న శిక్షకులు గోవింద్, రాములలను శాలువాలతో సన్మానించారు.

మరోవైపు అండర్-16 విభాగంలో నేషనల్ క్రికెట్‌కు ఎంపికైన తాండూరు క్రీడాకారుడు అభినవ్‌ను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సోమ శేఖర్, గుండప్ప, సీనియర్ జర్నలిస్టు శెట్టి రవిశంకర్, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు నాగప్ప, రిటైర్డ్ ఎస్ఐ నర్సింలు, నర్సిరెడ్డి, సాయిరెడ్డి, మహేందర్, నాయకులు భాను ప్రసాద్, బాలు యాదవ్, రమేష్ నాయక్, నరేష్ గౌడ్, శ్రీను ముదిరాజ్, హరీష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

