తెలంగాణ సీఎస్‌గా శాంతికుమారి
– సీఎంఓ నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా శాంతికుమారి నియమితులయ్యారు. సోమేశ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిన్న సమర్థించిన విషయం తెలిసిందే. దీంతో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న శాంతికుమారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ కలెక్టర్‌గా పనిచేశారు. వైద్య, ఆరోగ్యశాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్‌గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్‌లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. ఆమె ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆమెకు అభినందనలు తెలియజేశారు.



