రేపటి నుంచి కంటి వెలుగు-2.0

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

రేపటి నుంచి కంటి వెలుగు-2.0
– తాండూరులో అన్ని ఏర్పాట్లు సిద్దం
– మున్సిపల్‌లో మూడు ప్రత్యేక బృందాలు
– ఏక్కడ.. ఎంత మందికి నిర్వహిస్తున్నారంటే
తాండూరు, దర్శిని ప్రతినిధి: అంధత్వ నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో దశ కంటి వెలుగు ప్రారంభానికి అంతా సిద్దమైంది. తాండూరు పట్టణంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి వైద్యశాఖ, మున్సిపల్ శాఖ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పట్టణంలోని 36 వార్డుల్లో కంటి వెలుగు పరీక్షలను నిర్వహించబోతున్నారు. వంద రోజుల పాటు జరిగే కంటి వెలుగు కోసం 3 ప్రత్యేక బృందాలను నియమించారు. ముందుగా మూడు వార్డులలో నిర్వహించి.. ఆ తరువాత మరో మూడు వార్డులలో పరీక్షలను నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు 7వ వార్డు ఎన్టీఆర్ కాలనీ, 17వ వార్డు బస్తీ దవాఖాన, 33వ వార్డు కన్యా పాఠశాలలో కంటి వెలుగును ప్రారంభించబోతున్నారు. అర్బన్ వైద్యాధికారి సౌమ్యారాణి ఆధ్వర్యంలో ఒక్కొ బృందంలో కంటి వైద్యుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎఎన్ఎం, ఆశా వర్కర్, మున్సిపల్ సూపర్ వైజర్, సిబ్బందితో మొత్తం 10 మంది కంటి వెలుగుకు సేవలను అందించబోతున్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటి పరీక్షలను నిర్వహిస్తారు. ప్రతిరోజు 150 మందికి పరీక్షలను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కంటి వెలుగు విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సూచించారు. మరోవైపు తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ మేనేజర్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కంటి వెలుగు కోసం వసతులను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా కంటి వెలుగు సేవల కోసం 52 మంది సిబ్బందిని కేటాయించారు.