వేలి ముద్రలే పట్టించాయి..!

క్రైం తాండూరు వికారాబాద్

వేలి ముద్రలే పట్టించాయి..!
– ఐసీఎల్ ఫ్యాక్టరీ చోరీ చేధించిన పోలీసులు
– వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ రాంబాబు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: ఒక్కొ కేసులో పోలీసులు చిన్న క్లూ లతోనే పరిష్కరిస్తారు. కేసుల చేధనలో వేలి ముద్రలు చాలా కీలకం. ఆ వేలి ముద్రలనే తాండూరు మండలం ఐసీఎల్‌ కర్మాగారంలో జరిగిన చోరీ కేసులో నిందితులను పట్టించాయి. గత యేడాది డిసెంబర్ 29న అర్ధరాత్రి తాండూరు మండలం ఐసీఎల్ కర్మాగారంలో జరిగిన చోరీ కేసును తాండూరు రూరల్ పోలీసులు చేధించారు. మద్యప్రదేశ్ నుంచి వచ్చిన దొంగలు చోరీ చేసినట్లు నిర్ధారించారు. నిందితులలో ఇద్దరని రిమాండుకు తరలించగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. శుక్రవారం తాండూరు రూరల్ సీఐ రాంబాబు ఈ కేసు వివరాలను మీడియాకు ఓ ప్రకటనలో వెల్లడించారు. మల్కాపూర్ గ్రామ సమీపంలోని ఐసీఎల్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ లోని డీ2/4లో ఉంటున్న సెక్యూరిటీ ఆఫీసర్ ముత్యాల చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో గత యేడాది డిసెంబర్ 29న అర్ధరాత్రి చోరీ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన కరణ్‌ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి నుంచి ముమ్మరంగా విచారణ చేపట్టారు. అయితే చోరీ జరిగిన రోజు సంఘటనా ప్రదేశంలో నిందితుల వేలి ముద్రలను సేకరించారు. వాటి ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మధ్యప్రదేశ్ రాష్ట్రం ధారు జిల్లా నరహోలి తాండాకు చెందిన సురేష్ సింగార్ అలియాస్ సూరు, అదే జిల్లా భారత్ తండాకు చెందిన భరత్ చౌహాన్లకు చెందినవిగా గుర్తించారు. గురువారం కర్ణాటక రాష్ట్రం చందాపూర్ సమీపంలో సురేష్, భరత్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు సీఐ రాంబాబు తెలిపారు. అయితే వీరితో పాటు మరో ఇద్దరు చోటు వాసుమియా, గౌరవ్ సేఠ్‌లు కూడ చోరీలో పాల్గొన్నట్లు గుర్తించామని, వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వారిని కూడ పట్టుకున్న తరువాత చోరీ అయిన సొత్తును రికవరీ చేస్తామని సీఐ రాంబాబు తెలిపారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను తాండూరు కోర్టులో హాజరు పరిచి పరిగి జైలుకు రిమాండ్ కోసం తరలించడం జరిగిందని వివరించారు.