అరాచక ర్యాగింగ్..!
– జూనియర్ విద్యార్థిపై సీనియర్ల దాడి
– చపాతి పెంచుతో ఒంటిపై వాతలు
– సోషల్ వెల్ఫేర్ గురుకులంలో దారుణం
– ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : జూనియర్ విద్యార్థులపై సీనీయర్ విద్యార్థులు చేస్తున్న ర్యాగింగ్ అరాచకంగా మారుతోంది.

తాండూరు పట్టణంలో కొనసాగుతున్న పెద్దేముల్ మండలానికి సంబంధించిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల/హాస్టల్లో దారుణ సంఘటన వెలుగుచూసింది. పాఠశాలలో చదువుతున్న సాయి బాలాజీ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు లోకేష్, మణికంఠ తీవ్రస్థాయిలో అరాచకానికి ఒడిగట్టారు.

బాధితుడి ఒంటిపై చపాతి పెంచుతో కాల్చి వాతలు పెట్టడంతో పాటు దారుణంగా హింసించారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో సార్లు జరిగాయని బాధిత విద్యార్థి ఆవేధన వ్యక్తం చేశారు. దాడి విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు విద్యార్థిపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆదివారం పాఠశాల వద్దకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాఠశాలలో సీనీయర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై దాడులకు పాల్పడుతుంటే ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని పైగా ఉచిత సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులను పలకరించేందుకు వచ్చినా ప్రిన్సిపాల్ బయటకు వచ్చి కనీస సమాధానం కూడా చెప్పడం లేదని, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో వరుసగా జరుగుతున్న అరాచకాలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థికి న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


