రైతే రాజు కావాలి.. వ్యవసాయానికి పాత రోజులు రావాలి
– ట్రాక్టర్లు, యంత్రాల స్థానంలో జీవాలతో వ్యవసాయం సాగాలి
– ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతే రాజుగా ఉండాలని, వ్యవసాయ రంగానికి పాత రోజులు రావాలని ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో అర్హులైన రైతులకు లాటరీ పద్ధతిలో కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ రెడ్డి రైతులకు కోడెలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోశాల సేవా సమితి నిర్వహిస్తున్న కార్యక్రమంలో తనను భాగస్వామిని చేయడం సంతోషంగా ఉందన్నారు. తాండూరు గోశాలకు కీ.శే. శెట్టి అమిత్ చేసిన సేవలను కొనియాడారు.

వ్యవసాయానికి పాత రోజులు రావాల్సిన అవసరం ఉందని, జీవాలతో సాగు మళ్లీ పెరగాలని ఆకాంక్షించారు. ట్రాక్టర్లు, యంత్రాల స్థానంలో ఎద్దులతో వ్యవసాయం చేసే సంప్రదాయ పద్ధతులను ప్రోత్సహించాలని అన్నారు. రసాయనిక వ్యవసాయానికి బదులుగా సహజ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని సూచించారు. రైతులకు మేలు జరిగేలా పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. గోశాల ద్వారా పంపిణీ చేసిన కోడెలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

పశుసంపద పెంపుతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోశాల సేవా సమితి అధ్యక్షులు వినోద్ జైన్, మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల బాల్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి మన్మోహన్ సార్డా, కోశాధికారి పటేల్ విజయకుమార్, ఓం ప్రకాష్ సోమాని, కొట్రిక కిరణ్, సుబ్బారావు, 19వ వార్డు కౌన్సిలర్ జుంటుపల్లి వెంకటేష్, న్యాయవాదులు మహేందర్‌రెడ్డి, గుండప్ప, రైతులు తదితరులు పాల్గొన్నారు.


