వామ్మో.. కల్తీ రాయుడు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

వామ్మో.. కల్తీ రాయుడు..!
– ఫ్రాఫిట్‌ కోసం కృతిమ కారం పొడి
– తాండూరు కేంద్రంగా గుట్టుగా విక్రయాలు
– రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
– వ్యాపారిపై కేసు నమోదు చేసిన తాండూరు పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా ఎంతో మంది వ్యాపారులు కల్తీ వ్యాపారాలకు పాల్పడుతున్నారు. అల్లం, టీపోడి, పాలు, బెల్లం ఇలా ఎన్నో వ్యాపారాల్లో ధనార్జనే ధ్యేయంగా కల్తీతో కాసులు దండుకుంటున్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో గుట్టుగా సాగిస్తున్న కల్తీ కారంపొడి వ్యాపారం గుట్టును వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. శనివారం పట్టణంలో దాడులు నిర్వహించి కీలక వ్యాపారి వద్ద నుంచి సుమారు రెండు క్వింటాళ్ల కల్తీ కారం పొడిని స్వాదీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం సాయిపూరు ప్రాంతానికి చెందిన ఎండి ఎజాజ్ పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ లో కారం పొడికి సంబంధించిన వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

పైకి ఈ వ్యాపారం నిర్వహిస్తూనే గుట్టుగా పనికిరాని, కుళ్లిపోయిన మిరప కాయలతో పొడి తయారు చేసి.. రంగు కోసం రసాయనాలు కలిపి కల్తీ కారం పొడి తయారు చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. అలా తయారు చేసిన కల్తీ కారం పొడిని వివిధ ప్రాతాలకు ఎగుమతి చేస్తున్నట్లు వారి విచారణలో తేలింది. ఈ మేరకు శనివారం తాండూరు పట్టణం పాత కూరగాయల మార్కెట్ లోని ఎజాజ్ దుకాణంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దుకాణంలోని సుమారు రెండు క్వింటాళ్ల కారం పొడితో పాటు రంగులను, పాడైన మిరుపకాయలను స్వాధీనం చేసుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వ్యాపారిపై కేసు నమోదు చేస్తున్నట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ లు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్తీ వ్యాపారాలపై తాండూరు పోలీసులు ప్రత్యేక దృష్టిసారించడం జరిగిందని, గతంలో కల్తీ అల్లం, నూనె వ్యాపారాలపై కేసులు నమోదు చేసినట్లు గుర్తుచేశారు. ఎవరైనా కల్తీ వ్యాపారాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!