సేవాలాల్ మహరాజ్‌కీ జై..!
– తాండూరులో అట్టహాసంగా జయంతి
– పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– సేవాలాల్ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో సేవాలాల్ మహరాజ్‌కీ జై అంటూ నినాదాలు మారుమోగాయి. శనివారం తాండూరు పట్టణంలో ఆల్ ఇండియా బంజార వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వాసుపవార్ నాయక్, బంజారా సంఘాల ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోం సమీపంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కాంగ్రెస్ నాయకులు ధారాసింగ్, డాక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్, నాయకులతో కలిసి సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బంజారా జాతికోసం, గిరిజనుల సంస్కృతి సంప్రదాయాల కోసం సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. గిరిజనులంతా ఐక్యమత్యంగా ఉంటూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా గిరిజనుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. తాండూరులో ఓ మంచి స్థలంలో సేవాలాల్ విగ్రహా ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తానని అన్నారు. దీంతో పాటు నియోజకవర్గంలో గిరిజన తాండాలలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయిస్తానని హామి ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న బంజార కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, భీంసింగ్, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, గిరిజన నాయకులు వెంకట్రామ్ నాయక్, రాంచెందర్, రామ్యానాయక్, గిరిజన సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు. రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, మహిళ మోర్చ్ నాయకురాలు అంతారం లలిత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, మాజీ కౌన్సిలర్ బాలప్ప తదితరులు కూడా హాజరై సేవాలాల్ మహరాజ్ కు నివాళులు అర్పించారు.
ఇదికూడా చదవండి…

