వైద్య సేవలు భేష్..!
– జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం
– సదుపాయలు, సౌకర్యాల పురోగతిపై ఆరా
– కేంద్రానికి నివేధిక: పీఆర్సీ జేడీ డాక్టర్ శ్రీప్రసాద్ హెచ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: కార్పోరేట్‌కు ధీటుగా తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు భేషుగ్గా ఉన్నాయని కేంద్ర బృందం ధార్వాడ్ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్(పీఆర్సీ) జాయింట్ డైరెక్టర్(జేడీ) డాక్టర్ శ్రీప్రసాద్ హెచ్ అన్నారు. గురువారం తన బృందంతో కలిసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా జేడీ డాక్టర్ శ్రీప్రసాద్ హెచ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణలోని జిల్లా ఆసుపత్రులకు, ఆరోగ్య కేంద్రాలకు, సబ్ సెంటర్లలో వైద్య సేవలకు అందిస్తున్న నిధులపై సమీక్షించేందుకు వచ్చినట్లు తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో ఎన్ఆర్సీలో 20 బెడ్లు ఉన్న అందుకు సరిపడా వైద్య సేవలను అందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా మాతా శిశు ఆసుపత్రి అందుబాటులో ఉన్నా సద్వినియోగం చేసుకోకపోవడంపై కూడ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పాటు ఆసుపత్రి వైద్యులకు హెచ్ఆర్ తక్కువగా అందిస్తున్నట్లు గుర్తించామన్నారు. జిల్లా ఆసుపత్రిలో ఎన్‌హెచ్ఎం నిధుల ద్వారా అందిస్తున్న సేవలు సక్రమంగా అందిస్తున్నారని అన్నారు. కార్పోరేట్‌కు ధీటుగా వైద్య సేవలను అందిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎన్‌హెచ్ఎం నిధులను పెంచి మరింతగా గుణాత్మక సేవలందించేందుకు తోడ్పాటు అందిస్తామని అన్నారు. అదేవిధంగా ధార్వాడ్ పీఆర్సీ నుంచి రాష్ట్రంలోని సూర్యపేట్, హన్మకొండ, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో బృందాలు ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటి కేంద్రాలను సందర్శించడం జరుగుతుందని చెప్పారు. ఈ నివేధికను కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ నివేధికలపై కేంద్ర ఆరోగ్య విభాగం, క్యాబినెట్ మంత్రిత్వ శాఖ పునఃసమీక్ష చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్పేర్ ప్రోగ్రామ్ కోఆర్డీనేటర్ జగన్నాథ్‌రెడ్డి, బృందం సభ్యులు పవిత్ర, మరియా, ఆఫ్రీన్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ధరణి కుమార్, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మల్లికార్జున స్వామి, ఆర్ఓ డాక్టర్ ఆనంద్‌గోపాల్ రెడ్డి, డాక్టర్ యాదయ్య, డాక్టర్ సంతోష్‌కుమార్ తదితరులు ఉన్నారు.
