వికాసం వస్తుందో.. రాదో..!
– స్కీం ఆలస్యంతో పెరుగుతున్న ఆందోళన
– పైగా అర్హుల ఎంపికపై అనుమానాలు
– బ్యాంకర్ల లిస్టు ఒకటి, రాజకీయ జాబితా మరోకంటూ ప్రచారం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకమే రాజీవ్ యువ వికాసం. ఈ పథకానికి జిల్ఆలలో వేలాది మంది యువకులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ రుణాలు వస్తే స్వయం ఉపాధితో ఆర్థికంగా లాభపడవచ్చని భావిస్తే పథకానికి బ్రేక్ వేస్తూ ప్రభుత్వం లబ్దిదారుల ఆశలపై నీళ్లు చల్లిచట్లుగా మారింది.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం యువకులు, ప్రభుత్వ ఉద్యోగులే అని పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకనే యువత సాధికారత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టింది. స్వయం ఉపాధి పొందేందుకు అందిస్తున్న రుణాల కోసం జిల్లాలోని పల్లెల నుంచి పట్టణాల వరకు యువత వేలాది సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. మొదట తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రుణాలు అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం దరఖాస్తుల పరిమాణం అంచనాలను మించిపోవడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసిందని చెప్పవచ్చు. అనంతరం ఈ పథకాన్ని విడతల వారిగా అమలు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమలుపై ఉత్కంఠ.. అసహనం..
మొదటి సారి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తీరా విడతల వారిగా అమలు చేస్తామని తెలపడంతో రాజీవ్ యువ వికాసంపై లబ్దిదారుల్లో ఉత్కంఠతో పాటు అసహనం వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కింద నిరుద్యోగ యువతకు రూ. 50వేల నుంచి 4లక్షల లక్షల వరకు రుణాలు అందిస్తామని ప్రకటించడంతో జిల్లాలో చాలా మంది యువకులు దరఖాస్తులు చేసుకున్నారు. చాలా మంది రూ. 2లక్షల నుంచి 3లక్షల రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. తీరా ప్రభుత్వం మొదటి విడతలో రూ.50వేలు, 1లక్ష వరకు రుణాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తులు చేసుకున్న లబ్దిదారుల్లో ఆందోళన మొదలైంది.
కొనసాగుతున్న సస్పెన్స్..
ఇప్పటికే లబ్దిదారులు చేసుకున్న దరఖాస్తులను అధికారులు, బ్యాంకర్లు కలిసి వడబోశారు. బ్యాంకర్లు అయితే సిబిల్ స్కోర్ ఉన్న వారికే రుణాలు అందించాలని నిర్ణయించింది. అధికారులు, బ్యాంకర్ల సమన్వయంతో జాబితాలను సిద్దం చేశారు. కాని లబ్దిదారుల జాబితాను ఎక్కడా వెల్లడించలేదు. వచ్చిన దరఖాస్తుల్లో 90శాతం మందిని బ్యాంకర్లు ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బ్యాంకర్ల చేతిలో ఓ జాబితా ఉంటే.. ఈ జాబితాలో లబ్దిదారుల ఎంపిక రాజకీయ నేతల చేతిలో ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాంకర్లు, అధికారులు ఓ జాబితాను ఎంపిక చేస్తే.. రాజకీయ నేతలు మరో జాబితాను ఎంపిక చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే స్థానికంగా ఉండే ఇందిరమ్మ కమిటీల ఆమోదంతోనే లబ్దిదారుల ఎంపిక జరుగుతోందని సమాచారం. దీంతో దరఖాస్తులు చేసుకున్న లబ్దిదారులు తమకు వికాసం.. అందుతుందో లేదో అని ఆందోళనలో ఉన్నారు. దీనికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతోనే తెరపడనుంది.

ఇదికూడా చదవండి…

