వామ్మో.. కంపు.. కంపు..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్


వామ్మో.. కంపు.. కంపు..!

– తాండూరు నర్సింగ్ కాలేజీలో దుర్గంధం
– పగిలిపోయిన డ్రైనేజీ వ్యవస్థ
– పరిసర ప్రాంతాల్లో మురుగు దుర్వాసన
– పట్టింపులేని అధికారులతో అవస్థలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం పీపీ యూనిట్లో కొనసాగుతున్న నర్సింగ్ కాలేజీ కంపుకు నిలయంగా మారింది.

ఎంతో ఉత్సహాంగా చదువుకునేందుకు వచ్చే విద్యార్థులకు దుర్వాసన, దుర్గంధం స్వాగతం పలుకుతున్నట్లుగా పరిస్థితి మారిపోయింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పీపీ యూనిట్లోని భవనంలో గత కొన్ని నెలలుగా తాండూరు నర్సింగ్ కాలేజీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నర్సింగ్ విద్యార్థులకు ఈ భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. అక్కడే విద్యార్థులు బస చేస్తున్నారు.

అయితే పీపీ యూనిట్లోని నర్సింగ్ కళాశాలలో పారిశుద్ధ్యం తాండవిస్తోంది. భవనంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్తంగా మారడంతో మురుగు ప్రవహిస్తోంది. పైపులైన్లు కూడా ధ్వంసమైపోవడంతో మురుగు నీరు అంతా కళాశాల ఆవరణలోని రోడ్లపైకి వస్తోంది. అదేవిధంగా మరుగొడ్ల డ్రైనేజీ కూడా పూర్తిగా దెబ్బతినడంతో నీరంతా పైకి వస్తోంది.

దీనికితోడు చెత్త చెదారం కూడా మురుగు నీటి వద్ద ఉండిపోవడంతో దోమలు, ఈగలు, పురుగులు స్వైర విహారం చేస్తున్నాయి. ఆరోగ్యాలను కాపాడేందుకు చదువుకున్న కాలేజీలో కంపు తిష్టవేయడంతో రోగాలన్నింటికి నిలయంగా మారింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి పలువురు విద్యార్థులు కోరుతున్నారు.

ఇదికూడా చదవండి…

మనోహరన్న మంచిగుండాలే..!