చిన్న బిజినెస్‌కు పెద్ద లోన్..!
– ఎలాంటి పూచికత్తు లేకుండా మంజూరు
– రూ. 50వేల నుంచి 20లక్షల వరకు పొందే ఛాన్స్
– రుణం అకౌంట్లో పడితే కార్డు నుంచే డ్రా
– కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి తెలుసుకోండి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : మీది చిన్న వ్యాపారమైనా.. ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవాలన్నా ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంతో అభివృద్ధి చెందవచ్చు. ఎలాంటి హామీ లేకుండా రూ. 50వేల నుంచి రూ.20 లక్షల వరకు రుణం అందిస్తోంది.

అదే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ముద్రా యోజన. దేశంలోని చిన్న వ్యాపారులకు ఈ లోన్ వస్తుంది, కిరాణా షాపుల నుంచి పండ్లు, కూరగాయలు అమ్మే వారి వరకు ఈ లోన్ తీసుకోవచ్చు. చేతి వృత్తులు, చిన్న చిన్న హోటల్ రెస్టారెంట్లు నడిపే వారు, బ్యూటీ పార్లర్, టైలరింగ్ షాప్ ఇలా దాదాపు అన్ని చిన్న బిజినెస్లకు ఈ స్కీమ్ ద్వారా లోన్స్ వస్తాయి.

లోన్‌లు ఎలా ఇస్తారంటే..?
ఈ పథకంలో మీ వ్యాపారాన్ని బట్టి రుణాల మంజూరు ఉంటుంది. ఇది ప్రధానంగా నాలుగు విధాలుగా ఉంటుంది. మొదటిది శిశు. దీని ద్వారా కొత్త బిజినెస్ పెట్టాలనుకునే వారికి ₹50,000 వరకు లోన్ ఇస్తారు. రెండవది కిషోర్, ఇప్పటికే వ్యాపారం ఉండి మరింత పెట్టుబడి కోసం చూస్తుంటే ₹50,000 నుండి ₹5,00,000 వరకు లోన్ ఇస్తారు. మూడవది తరుణ్. ఇందులో వ్యాపారాన్ని భారీగా విస్తరించడానికి ₹5,00,000 నుంచి ₹10,00,000 వరకు లోన్ ఇస్తారు.

చివరిది తరుణ్ ప్లస్. ఇప్పటికే తరుణ్ కేటగిరిలో లోన్ తీసుకొని రీపే చేస్తే, ఈ కొత్త కేటగిరిలో ₹20,00,000 వరకు కొత్త లోన్ లభిస్తుంది. ఈ లోన్ తీసుకోవడానికి ఎలాంటి షూరిటీ అవసరం లేదు. అలాగే శిశు లోన్లపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ముఖ్యంగా వ్యాపారంలో మహిళలను ప్రోత్సహించేందుకు వడ్డీ రేట్లలో రాయితీలు కూడా ఉంటాయి. ఒకసారి లోన్ అమౌంట్ అప్రూవ్ అయ్యాక, ముద్ర కార్డ్ ఇస్తారు దీనితో మీ బిజినెస్ కి అవసరమైనప్పుడు కొంచెం కొంచెంగా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు

ఎలా అప్లై చేసుకోవాలంటే..?
అర్హులైన వ్యాపారులు ముద్ర లోన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఉద్యామి మిత్ర లేదా జన్ సమర్థ్ ఈ రెండు గవర్నమెంట్ వెబ్సైట్ లలో అప్లై చేసుకోవచ్చు. లేదా ఆఫ్ లైన్ లో అయితే మీకు దగ్గరలోని ప్రభుత్వ ప్రైవేట్ గ్రామీణ బ్యాంకుల్లో ఈ లోన్ కు అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటరు ఐడి బిజినెస్ వివరాలు అడ్రస్ కావాలి.


