తాండూరు అభివృద్ధి పరాయి పాలు..!
– కాంగ్రెస్ పాలనలో ప్రగతి ఎక్కడ..?
– బీఆర్ఎస్ పార్టీపై కౌంటర్లపైనే దృష్టి
– రాజీనామ చేసి.. మళ్లీ ఎన్నికల్లో తేల్చుకుందాం
– బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పరాయి ప్రాంతాల పేరుతో విరాజిల్లుతుందని బీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ జావిద్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆదివారం ఆయన తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న తాండూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణాన్ని సందర్శించి మాట్లాడారు. కళాశాల భవనంపై ప్రభుత్వ వైద్య కళాశాల కొడంగల్ అని పేరు మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక నాయకుడు రోహిత్ రెడ్డి చొరవతో తాండూరులో నిర్మించిన వైద్య కళాశాల భవనానికి కొడంగల్ పేరు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.

తాండూరుకు చెందిన నీళ్లు, ఇసుక, సుద్ద వంటి సహజ వనరులతో పాటు అభివృద్ధి ఫలాలను కూడా కొడంగల్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాండూరు అభివృద్ధితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ నాయకులపై అసత్య ప్రచారాలు, రాజకీయ కుట్రలకు పాల్పడటం సరికాదన్నారు. అభివృద్ధిపై మాట్లాడే దమ్ముంటే తేల్చుకుందాం అంటూ మున్సిపల్ ఛైర్మన్‌కు సవాల్ విసిరారు.

ఇద్దరం తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో పోటీ చేద్దామని, ఎవరి వెంట ప్రజలు ఉన్నారో తేలిపోతుందని అన్నారు. వెంటనే ప్రభుత్వ వైద్య కళాశాలపై ఉన్న పేరును మార్చకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో, రోహిత్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేపడతామని జావేద్ హెచ్చరించారు.


