జిల్లా కేంద్రాల్లో బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలి
– తాండూరు కేంద్రాన్ని వెంటనే పునఃప్రారంభించాలి
– అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్, మెటిరియల్ అందించాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలో పోలీసు రిక్రూట్మెంట్–2026కు సంబంధించి విడుదలైన నోటిఫికేషన్ నేపథ్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు, తాండూరు కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ కోరారు.

ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 7,437 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాల యువతతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన పలువురు అభ్యర్థులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందే ఆర్థిక స్థోమత లేక అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసి పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్, నాణ్యమైన స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులు, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గతంలో తాండూరులో పనిచేసిన బీసీ స్టడీ సెంటర్ ద్వారా పలువురు యువత ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు.

ఈ కేంద్రాన్ని వెంటనే పునఃప్రారంభించేలా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని అభిలాషించారు. సెంటర్‌ను తక్షణమే పునఃప్రారంభించడంతో పాటు పోలీసు రిక్రూట్మెంట్కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్, స్టడీ మెటీరియల్త తదితర అవసరమైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాజ్‌కుమార్ కోరారు.


