మాయలేడి అరెస్టు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మాయలేడి అరెస్టు..!
– బంగారంతో పరారైన మహిళ కేసు ఛేదింపు
– నిందితురాలి నుంచి 3తులాల బంగారం స్వాదీనం
– వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మాయమాటలతో మహిళను నమ్మించి బంగారు పుస్తెలతాడును కాజేసిన నిందితురాలిని తాండూరు పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

ఆమె వద్ద నుంచి దొంగిలించిన సుమారు మూడు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాండూరు పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ధారూర్‌ ప్రాంతానికి చెందిన నీరటి స్వరూప 8నెలల క్రితం వైద్యలింగం, విజయమ్మల ఇంట్లో నివాసం ఉండేది.

కొన్ని రోజుల తరువాత ఆ ఇంటిని ఖాళి చేసి వెళ్లిపోయింది. అయితే గత నెల జూలై 21న తాండూరులోని మార్వాడీ బజార్‌లో ఉన్న విజయమ్మను కలిసేందుకు స్వరూప వెళ్లింది. అక్కడ విజయమ్మ మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును చూసి మీ పుస్తెలతాడు డిజైన్ చాలా బాగుంది. మా తమ్ముడి పెళ్లికి ఇలాంటి డిజైన్ చేయించాలనుకుంటున్నాం అంటూ బాధితురాలితో మాటలు కలిపింది.

పుస్తెలతాడును ఫోటో తీసుకుంటానని నమ్మించి చేతిలోకి తీసుకున్న అనంతరం అక్కడి నుంచి పరారైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తాండూరు పట్టణ పోలీసులు నిందితురాలు నీరటి స్వరూపను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె నేరాన్ని అంగీకరించడంతో అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి దొంగిలించిన సుమారు మూడు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.

ఫ్రెండ్‌షిఫ్ డే రోజు రీయూనియన్