పీఎఫ్ బకాయిలు ఇవ్వలేదని
– ఆసుపత్రి కార్మికురాలు ఆత్మహత్యాయత్నం
– తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : పీఎఫ్ బకాయిలు ఇవ్వడం లేదని ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ కార్మికురాలు క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.

ఈ సంఘటన శుక్రవారం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. బాధిత కార్మికురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో హన్మమ్మ అనే మహిళ ఔట్ సోర్సింగ్ విధానంలో స్వీపర్‌గా పనిచేస్తోంది. అయితే తనకు నాలుగు సంవత్సరాల నుంచి రావాల్సిన పీఎఫ్ డబ్బులు బకాయిలు ఏర్పడ్డాయి.

సంబంధిత ఏజెన్సీ నుంచి ఆ డబ్బులు రాలేదు. ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెందిన హన్మమ్మ శుక్రవారం ఉదయం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి సిబ్బంది వైద్యుల సహాకారంతో చికిత్స అందించారు.

అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వైద్యులు రిఫర్ చేశారు. కాగా ఈ సంఘటనపై ఆసుపత్రి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పీఎఫ్ డబ్బులు చెల్లించకపోవడంతోనే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు, స్పందించి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.


