రాత్రయినా.. ఆగని సేవ..!
– 200మంది విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ
– షేక్ మౌజంను అభినందించిన చైర్ పర్సన్
– వీడియో కాల్‌లో ఎమ్మెల్యేకు బర్త్ డే విషేష్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలతో కొనసాగుతున్నాయి. బుదవారం నుంచి మొదలైన వేడుకలు రాత్రి అయినా ఆగలేదు.

ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని యువ నాయకుడు షేక్ మౌజం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని సంక్షేమ వసతి గృహంలో సుమారు 200 మంది విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దుప్పట్లు అందజేశారు.

విద్యార్థుల అవసరాలను గుర్తించి నిర్వహిస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల జన్మదినాలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ వసతి గృహంలోని విద్యార్థులు వీడియో కాల్ ద్వారా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యే వారికి ఆప్యాయంగా స్పందిస్తూ, విద్యను లక్ష్యంగా పెట్టుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం దుప్పట్లు అందుకున్న విద్యార్థులు తమ అవసరాన్ని గుర్తించి సహాయం అందించిన యువ నాయకుడు షేక్ మౌజంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, పార్టీ నేతలు, కార్యకర్తలు, వసతిగృహం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


