వికలాంగుల సేవా కార్యక్రమం అభినందనీయం
– వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి
– ఉచిత జైపూర్ కాళ్ల, కాలిఫర్ శిబిరం పోస్టర్ ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికలాంగులకు తోడ్పాటు అందించేందుకు మార్వాడి యువమంచ్ ముందుకు రావడం ఎంతో అభినందనీయమని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితా మహేందర్ రెడ్డి అన్నారు. వచ్చేనెల 6 నుంచి 8వ తేది వరకు పట్టణంలోని బాలాజీ మందిర్‌లో మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత జైపూర్ కాళ్ల అమరిక, కెలిఫర్ శిబిరానికి సంబంధించిన కరపత్రాన్ని గురువారం ఆవిష్కరించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునితారెడ్డి చేతుల మీదుగా మంచ్ సభ్యులు దీనిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి మాట్లాడుతూ వికలాంగుల కోసం మార్వాడి యువమంచ్ చేపడుతున్న సేవా కార్యక్రమం అభినందనీమన్నారు. వికలాంగులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మరోవైపు మంచ్ సభ్యులు తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డి.రవీందర్ చేతుల మీదుగా శిబిరం కరపత్రాన్ని ఆవిష్కరించారు. శిబిరంలో 6,7,8వ తేదిల్లో వికలాంగుల నుంచి జైపూర్ కాళ్ల, కెలిపర్ పరికరాల అమరిక కోసం కొలతలు తీసుకోవడం జరుగుతుందని, 9,10 వ తేదిల్లో అమర్చడం జరుగుతుందని మంచ్ సభ్యులు తెలిపారు. వికలాంగులు తమ వెంట ఆధార్ కార్డు, అంగవైకల్యానికి సంబంధించి రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకరావాల్సి ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సర్డా, కన్వినర్ కుంజ్ బిహారి సోని, తాండూరు అధ్యక్షులు సన్ని అగ్రవాల్, క్యాంపు చైర్మన్ సునిల్ సర్డా తదితరులు పాల్గొన్నారు.
