అయ్యో పాపం లక్ష్మీ..!
– రైతు బీమా డబ్బుల కోసం అవస్థలు
– బ్యాంకులో నుంచి రూ.2 లక్షలు మాత్రమే చెల్లింపు
– మిగతా చెల్లింపులో బ్యాంకు అధికారుల కొర్రీలు
– డ్వాక్రా గ్రూపు బకాయిలపై ముడిపెట్టి వేధింపులు
– ఎమ్మెల్యే స్పందించాలని బాధితురాలి ఆవేదన
తాండూరు, దర్శిని ప్రతినిధి : భర్తను కోల్పోయిన విషాదం నుంచి తేరుకోకముందే రైతు బీమా సొమ్ము కోసం ఓ మహిళ బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన తాండ్ర బాలప్ప మృతి చెందడంతో ఆయన భార్య తాండ్ర లక్ష్మీ రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం రైతు బీమా సొమ్ము తన పేరుపై తాండూరు ఎస్బీఐ ఏడీబీ బ్యాంకులో జమ అయినట్లు లక్ష్మీ తెలిపింది. లక్ష్మీ వసంత అనే పొదుపు సంఘంలో సభ్యురాలుగా ఉంది. ఈ సంఘం పేరుపై బ్యాంకులో బకాయిలు ఉన్నాయి.

అయితే బ్యాంకులో డ్వాక్రా గ్రూపు రుణం ఉందని మేనేజర్ చెప్పడంతో, రుణ బకాయిలను మినహాయించి మిగిలిన సొమ్ము ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరినట్లు బాధితురాలు తెలిపింది. ఈ క్రమంలో రూ.2 లక్షలు మాత్రమే చెల్లించి, మిగతా మొత్తాన్ని ఇవ్వకుండా బ్యాంకు అధికారులు తిప్పుతున్నారని ఆమె ఆరోపించింది. రైతు బీమా సొమ్ము తన పేరుతో జమ అయినప్పటికీ, డ్వాక్రా గ్రూపులోని ఇతర సభ్యుల రుణాలను తీర్చిన తర్వాతే మిగతా డబ్బులు ఇస్తామని చెబుతున్నారని పేర్కొంది.

భర్తను కోల్పోయిన బాధలో ఉన్న సమయంలో ఇలా బ్యాంకు చుట్టూ తిప్పడం తనను మరింత మానసిక వేదనకు గురిచేస్తోందని ఆమె కన్నీటి పర్యంతమైంది. కుటుంబానికి అండగా నిలవాల్సిన సమయంలో రైతు బీమా సొమ్ము కోసం ఇలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడంపై విచారం వ్యక్తం చేస్తోంది. తన సమస్యను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది. రైతు బీమా సొమ్ము విషయంలో తాను ఎదుర్కొంటున్న సమస్యను అధికారులు పరిశీలించి, తనకు రావాల్సిన మొత్తాన్ని అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతోంది.


