తాండూరులో ఏసీబీ దాడులు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో ఏసీబీ దాడులు
– మైన్స్ ఏడీ ఘటనతో సోదాలు
– పట్టణం, పెద్దేముల్ మండలంలో తనిఖీలు..
– కలవరపాటుకు గురిచేసిన వ్యవహారం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు నిర్వహించిన సోదాలు కలకలం రేపాయి.

భూపాలపల్లి జిల్లాలో మైన్స్ ఏడీగా పనిచేస్తున్న జయరాజ్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టినట్లు సమాచారం. గతంలో ఆయన తాండూరులో విధులు నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడ ఆయనకు సంబంధించిన వ్యవహారాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి తాండూరు పట్టణంతో పాటు పెద్దేముల్ మండలంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. తాండూరు పట్టణంలోని ఖాన్ కాలనీలో జయరాజ్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఇంట్లోని పలు అంశాలపై ఆరా తీస్తూ, గతంలో జరిగిన లావాదేవీలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్లు సమాచారం. అదేవిధంగా పెద్దేముల్ మండలం మారేపల్లి గ్రామంలో సుద్ద వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలపైనా ఏసీబీ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

జయరాజ్ గతంలో తాండూరులో మైన్స్ శాఖలో పనిచేసిన సమయంలో జరిగిన కార్యకలాపాలు, ఆయనకు పరిచయాలు ఉన్న వ్యక్తులు, ఆస్తులకు సంబంధించిన లావాదేవీలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు ఒక్కసారిగా తాండూరులో సోదాలు నిర్వహించడంతో పట్టణంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మైన్స్ శాఖతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు, అధికారుల్లోనూ ఈ సోదాలు ఆందోళనకు గురిచేసినట్లు కనిపించింది. అయితే సోదాల్లో ఏ మేరకు కీలక ఆధారాలు లభించాయి? ఎలాంటి పత్రాలు లేదా ఆస్తులకు సంబంధించిన వివరాలను అధికారులు గుర్తించారు? అనే అంశాలపై అధికారికంగా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

మరోవైపు భూపాలపల్లి జిల్లాలోని మైన్స్ ఏడీ జయరాజ్‌కు సంబంధించిన కేసులో భాగంగానే తాండూరులోనూ ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారుల విచారణ పూర్తయిన తర్వాతే సోదాల పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు