హిందూ ఉత్సవ సమితికి ఎమ్మెల్యే అండ
– ఉత్సవాల కోసం రూ.3.51 లక్షల విరాళం
– రూ.85 లక్షలతో భవనం, ప్రహరీ నిర్మాణ పనులు
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆర్థిక సహాయం అందించారు.

గురువారం ఉత్సవాల నిర్వహణకు రూ.3లక్షల 51వేల విరాళాన్ని హిందూ ఉత్సవ సమితి అధ్యక్షురాలు, మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్‌కు ఎమ్మెల్యే ఈ మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

అదేవిధంగా తాండూరు పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో హిందూ ఉత్సవ సమితికి స్థలం కేటాయించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అక్కడ దాదాపు రూ.85 లక్షల వ్యయంతో హిందూ ఉత్సవ సమితి భవనం, ప్రహరీ గోడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు విజయవంతం కావడానికి భవిష్యత్‌లోనూ తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు బాతుల నాగరాజు, కౌన్సిలర్లు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, పలువురు నాయకులు ఉన్నారు.


