నిమజ్జనానికి సర్వం సిద్ధం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నిమజ్జనానికి సర్వం సిద్ధం..!
– ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు, హిందూ ఉత్సవ సమితి
– కాగ్నా నది వద్ద బారికేడ్లు.. విద్యుత్‌, రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో శుక్రవారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి నిమజ్జన కార్యక్రమం ప్రారంభం కానుంది.

యాలాల మండలం కోకట్‌ వద్ద కాగ్నా నదిలో గణనాథుల విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికారులు, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. కాగ్నా నది వద్ద జరుగుతున్న ఏర్పాట్లను తాండూరు మున్సిపల్‌ అధికారులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు రాకపోకలకు ప్రత్యేక మార్గాలను సిద్ధం చేశారు.

నిమజ్జన ప్రాంతంలో విద్యుత్‌ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, వచ్చి వెళ్లే మార్గాలను అధికారులు పరిశీలించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చోట్ల బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పేర్కొన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి వచ్చే భక్తులు అధికారుల సూచనలు పాటించి సహకరించాలని కోరారు.

తాండూరులో నేడు గణేశ్‌ నిమజ్జన మహోత్సవం!