రెచ్చిపోయిన ఇసుకాసురులు
– రవాణా అడ్డుకున్నందుకు వీఆర్ఎపై దాడి
– మండి పడిన పాత తాండూరు కౌన్సిలర్లు, ప్రజలు
– తహసీల్దార్ కార్యాలయం ముందు బాధితుడితో నిరసన
– నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరులో ఇసుకాసురులు రెచ్చిపోయారు. ఓ వీఆర్ఏ దౌర్జన్యం ప్రదర్శించి దాడి చేశారు. ఈ సంఘటన మున్సిపల్ పరిధి పాత తాండూరులో ఉద్రిక్తతను రేపింది. వివరాల్లోకి వెళితే.. పాత తాండూరుకు చెందిన గడుగు ఎల్లప్ప వీఆర్ఎగా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి పాత తాండూరు మీదుగా వెళుతున్న అక్రమ ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీనిపై అదే పాత తాండూరుకు చెందిన జాకీర్ లాల కుమారుడు అబ్రాహర్ లాల వీఆర్ఏ ఎల్లప్పపై దౌర్జన్యంగా దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న పాత తాండూరు వాసులు అదే రాత్రి ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున పోలీస్టేషన్ కు తరలివెళ్లి ఫిర్యాదు.. చేశారు. గురువారం ఉదయం ఈ సంఘటనపై పాత తాండూరులో ఉద్రిక్తత ఏర్పడింది.
విషయం తెలుసుకున్న పాత తాండూరు కౌన్సిలర్లు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, ఎర్రం వసంత, ఎంఐఎం కౌన్సిలర్లు బొంబీనా, ఆఫ్రిన్ జవేరియా తదితరులు వీఆర్ఎ పై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం తాండూరు తహసీల్దార్ కార్యాలయానికి కౌన్సిలర్లతో పాటు పాత తాండూరుకు చెందిన యువజన సంఘాలు చేరుకుని నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ చిన్నప్పల నాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. రాజకీయ నేతల అండ చూసుకుని అక్రమార్కులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్ఎపై దాడి చేసిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు పాత తాండూరు మీదుగా ఇసుక రవాణా అనుమతులు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అక్రమ ఇసుక రవాణాను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే.. ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరోవైపు కౌన్సిలర్లు, నాయకులు తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ ను కలిసి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పాత తాండూరు కౌన్సిలర్లు, నేతలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


