పేదల సొంతింటి కల సాకారమే ధ్యేయం
– ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇంట సంతోషం
– లబ్ధిదారుల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ సర్కారు ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

శుక్రవారం తాండూరు మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకున్న రెండు కుటుంబాల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. 9వ వార్డులో సగ్గెం ఇందిర–నారాయణ, 27వ వార్డులో రజియా బేగం–దస్తగిర్ నిర్మించుకున్న నూతన ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ..పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన ఉద్దేశం. సొంతింటి కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని అన్నారు.

అదేవిధంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమ కుటుంబాలకు భరోసా కల్పించిన ప్రభుత్వానికి, సీఎం, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, నాయకులు అబ్దుల్ రవూఫ్, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, బంటు మల్లప్ప, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.


