అర్హుల ఓటు తొలగకుండా ప్రత్యేక దృష్టి
– రాష్ట్రంలో 60శాతం నోటీసుల ప్రక్రియ
– నోటీసులు అందుకున్న వారు సమాధానం ఇవ్వాలి
– పెండింగ్ నోటీసులు త్వరగా అందించాలని ఆదేశం
– ఆన్‌లైన్‌లో పత్రాల సమర్పణకు కీలక సూచన
– తాండూరు నియోజకవర్గంలో సర్ భేష్
– తెలంగాణ రాష్ట్ర సీఈఓ సుదర్శన్ రెడ్డి
– క్షేత్రస్థాయిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలిన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో అర్హుల ఓటు హక్కు తొలగిపోకుండా ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) సుదర్శన్ రెడ్డి అన్నారు.

శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ నోటీసుల జారీ, పత్రాల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ దీపక్ తీవారి, అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, తాండూరు ఆర్డీఓ అనిత తదితరులతో కలిసి తాండూరు పట్టణం, తాండూరు మండలంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా నోమ్యాపింగ్, అనామలీస్ విభాగాలపై ప్రత్యేకంగా పరిశీలించారు. అంతకుముందు ఆర్డీఓ కార్యాలయంలో సీఈఓ సుదర్శన్ రెడ్డి అధికారులతో సమావేశం అయ్యారు.

ఎస్‌ఐఆర్ పక్రియను పారదర్శంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా అనవసరంగా జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అదే సమయంలో అనర్హులు, డూప్లికేట్ ఎంట్రీలు, చిరునామా మార్పులను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. డోర్-టు-డోర్ వెరిఫికేషన్, పత్రాల పరిశీలన, డేటా ఎంట్రీ, మ్యాపింగ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన సందర్భాల్లో ఓటర్లకు నోటీసులు జారీ చేసి వారి అభ్యంతరాలు, వివరణలను నిబంధనల ప్రకారం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

అనంతరం తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం, ఎంపీటీ ఫంక్షన్ హాల్, తాండూరు మండలం గౌతాపూర్ ప్రాంతాల్లో బీఎల్‌ఓలు చేపడుతున్న పక్రియను పరిశీలించారు. నోటీసుల జారీ, పత్రాల స్వీకరణపై ఆరా తీశారు. ఈ సందర్బంగా సీఈఓ సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియ 60శాతం పూర్తి అయ్యిందని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో 95శాతం నోటీసులు అందించడం జరిగిందని, 70శాతం వరకు నోటీసులపై పత్రాలను తీసుకోవడం జరిగిందని, తాండూరులో ఎస్‌ఆర్ఐ సజావుగా జరగడం బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అర్హులైన ఓటర్లను తొలగించకుండా ఉండేందుకు ప్రత్యేక దృష్టిసారించడం జరుగుతుందని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. నోటీసులకు పత్రాలను ఆన్‌లైన్‌లో కూడా అందించవచ్చని, ఏమైనా ఇబ్బందులు ఉంటే బీఎల్‌ఓలు, అధికారులను సంప్రదించ్చవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారా సింగ్, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య,తదితర అధికారులు పాల్గొన్నారు.


