బీసీ శ్మశాన వాటికలకు నిధులివ్వాలి..!
– రూ.5 కోట్లతో అభివృద్ధి చేయాలి
– జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– ఆత్మ గౌరవ దీక్షకు 16 కుల సంఘాలు, నేతల సంఘీభావం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని బీసీ శ్మశాన వాటికలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.5 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శ్మశాన వాటికల సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలతో కాకుండా శాశ్వత ప్రణాళికతో ముగింపు పలకాలని కోరారు.

మంగళవారం బీసీ సంఘం తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ రాజ్‌కుమార్ కందుకూరి ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో ఆత్మగౌరవ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు16 కుల సంఘాల ప్రతినిధులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, దళిత సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు హాజరై సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా రాజ్‌కుమార్ కందుకూరి మాట్లాడుతూ.. పట్టణంలోని శ్మశాన వాటికల్లో ప్రహరీలు, అంతర్గత రహదారులు, నీటి సౌకర్యం, విద్యుత్, లైటింగ్, షెడ్లు, దహన వేదికలు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఏళ్లుగా సమస్యలు కొనసాగుతున్నా పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.

పలువురు నాయకులు మాట్లాడుతూ శ్మశాన వాటికల అభివృద్ధి కోసం దీక్ష చేపట్టాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. బీసీలు ఐక్యంగా తమ సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగుతున్నారని తెలిపారు. శ్మశాన వాటికల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, 16 కుల సంఘాల ప్రతినిధులు, బీసీ సంఘం నాయకులు, కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


