ప్రసవం అనంతరం తల్లీ.. శిశువు మృతి..!
– తాండూరు ఎంసీహెచ్‌లో విషాద ఘటన
– వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకుల ఆరోపణ
– ఘటనపై విచారణకు ఆసుపత్రి అధికారులు హామీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణి, ప్రసవం అనంతరం పుట్టిన ఆడ శిశువుతో సహా మృతి చెందడంతో తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లీ, శిశువు మృతి చెందారని కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.

కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం జినుగుర్తికి చెందిన బాలమణికి కర్ణాటక రాష్ట్రం సేడం తాలూకా అనంతపూర్‌కు చెందిన రాజుతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న బాలమణిని ప్రసవం కోసం బుధవారం కుటుంబ సభ్యులు తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఉదయం వైద్యులు ప్రసవం నిర్వహించగా.. కొద్దిసేపటికే బాలమణి, పుట్టిన ఆడ శిశువు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. 8వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ జావిద్ కూడా ఆసుపత్రికి చేరుకుని ఘటనపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, కౌన్సిలర్ వైద్యులతో వాగ్వాదానికి దిగారు.

మరోవైపు ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని విచారణ చేపడతామని ఆసుపత్రి అధికారులు తెలిపారు. మృతి ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


