పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై గురి
– ఓటరు నమోదును పకడ్బందీగా చేపట్టాలి
– విజయంతో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి (బీఎంఆర్) సూచించారు.

ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధవారం రాత్రి తాండూరులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన దిశానిర్దేశ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియకు నవంబర్ 6 చివరి తేదీ కావడంతో అర్హులైన ప్రతి పట్టభద్రుడికి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు.

గ్రామాలు, పట్టణాలు, వార్డుల వారీగా పట్టభద్రులను గుర్తించి ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ నమోదు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఓటరు నమోదుకు అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానంపై అర్హులకు సరైన సమాచారం అందించాలని, సోషల్ మీడియా ద్వారా కూడా నమోదు ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

పార్టీ నాయకులకు అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వహిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, ఎస్ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


