తస్మాత్…. జాగ్రత్త…!
– దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలి
– ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు
– పట్టణ ప్రాంతాల్లో ఆటోలో అనౌన్స్ మెంట్
– ఈ సూచనలతో మీ ఇళ్లు సేఫ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తస్మాత్ జాగ్రత్త.. అంటూ తాండూరు పట్టణ పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. ప్రస్తుత వేసవిలో సెలవులు, పండగలు అంటూ ఊరికి వెళ్ళేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని దొంగతనాలపై ముందస్తు జాగ్రత్తలు సూచించారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిల ఆదేశాల మేరకు తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ సిబ్బంది ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.

తాండూరు పట్టణంలోని అన్ని ప్రాంతాలలో ఆటోలో మైక్ అనౌన్స్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సెలవులు, పండగలకు ఊళ్లకు వెళ్లే వాళ్లు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. వీలైనంత వరకు ప్రజలు బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదులను ఇంట్లో ఉంచుకోరాదని, వాటిని లాకర్లలో దాచుకోవాలని అన్నారు. బీరువా తాళాలు ఇంటి వద్ద పెట్టవద్దని అన్నారు. ఇండ్లకు నాసిరకం తాళాలు కాకుండా.. బలమైన తాళాలు, వీలైతే సెంట్రల్ లాక్ సిస్టమ్ అలవర్చుకోవాలన్నారు. అదేవిధంగా వాహనాలను పార్కు చేసి వాటి తాళాలను కూడా వెంట తీసుకెళ్లాలనని అన్నారు. ముఖ్యంగా ఇండ్లలో సీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు.

ఊళ్లకు వెళ్లే సమయంలో నమ్మకమైన వాచ్ మెన్. లేదా నమ్మకస్తులకు సమాచారం అందించాలన్నారు. బస్సులో, రైళ్లలో వెళ్లే సమయంలో కూడా అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. అదేవిధంగా కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, అనుమానం ఉన్న వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు(డీఎస్పీ సెల్: 8712670017, సీఐ సెల్: 8712670049) లేదా డయల్ 100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు, ప్రజలు సమన్వయంగా ఉంటే దొంగతనాలను నియంత్రించవచ్చని అన్నారు.
ఇదికూడా చదవండి….

