మున్సిపల్ కార్మికులకు అందలం..!
– ప్రతినెల ఉత్తమ కార్మికుడికి సన్మానం
– స్వచ్ఛ సర్వేక్షన్‌తో కొత్త సంప్రదాయం
తాండూరు, దర్శిని ప్రతినిధి: పారిశుద్ధ్యంలో తాండూరు పట్టణం మెరిసేలా.. ఆదర్శంగా నిలిపేలా అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. పారిశుద్ధ్యంలో కీలకపాత్ర పోషించే కార్మికులలో చైతన్యం నింపే కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ మేరకు పట్టణ పారిశుద్ధ్య నియంత్రణలో భాగంగా ఉత్తమ సేవలు అందించే కార్మికులకు అందరు గౌరవించేలా అందలం ఎక్కించేందుకు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ప్రతి నెలా మున్సిపల్‌లో ఉత్తమ సేవలు అందించిన కార్మికులను సన్మానించే కార్యక్రమాలను చేపడుతున్నారు. సోమవారం నుంచే ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో భాగంగా ప్రతినెలా ఉత్తమ కార్మికుడిని ఎంపిక చేసి సన్మానించబోతున్నారు. దీని ద్వారా ఇతర కార్మికుల్లో చైతన్యం నింపేలా ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ మేరకు సోమవారం తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషన్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నవంబర్ నెలకు సంబంధించి కార్మికులకు సన్మానం నిర్వహించారు. మున్సిపల్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు లాలప్ప(డ్రైన్ క్లీనర్)ను సన్మానించి అభినందించారు. అనంతరం ఆర్డీఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఇకపై ప్రతినెలా ఉత్తమ కార్మికుడిని ఎంపిక చేసి సన్మానిస్తామని తెలిపారు. కార్మికుల్లో చైతన్యం నింపి తాండూరును ఆదర్శంగా నిలిపేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనీయర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, ఫ్లోర్ లీడర్లు సోమశేఖర్, ఆసిఫ్, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, అంతారం లలిత, సంగీత ఠాకూర్, మున్సిపల్ శానిటరి ఇనుస్పెక్టర్ శ్యాంసుందర్ తదితరులు ఉన్నారు.
