అక్రమంగా గ్యాస్ సిలిండర్ల రీఫిల్లింగ్
– గుట్టు రట్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు
– పట్టణ పోలీసులకు ఇద్దరు వ్యక్తుల అప్పగింత
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రాంతంలో నిబంధనలకు విరుద్దంగా గ్యాస్ సిలిండర్ల రీఫిల్లింగ్ దందా యధేచ్చగా కొనసాగుతోంది. అక్రమంగా కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ల రీఫిల్లింగ్ దందా గుట్టును జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మంగళవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు తాండూరు పట్టణంలో దాడులు చేశారు. పట్టణంలోని సయ్యద్ ఆరీఫ్ పటేల్, వేణుగోపాల్ అనే వ్యక్తులు పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లకు రీఫిల్లింగ్ చేస్తున్నారని పక్కా సమాచారం అందింది. ఈ మేరకు వారి స్థావరాలపై అకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో గ్యాస్ అక్రమ రిపిల్లిoగ్ చేస్తున్న వ్యక్తుల నుంచి 9 అనుబంధ సిలిండర్లను మరియు 27 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిద్దరిని తాండూరు పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.

