ఆర్టీసీ డీపోల‌ను ఎత్తేసే ప్ర‌స‌క్తే లేదు

తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్

ఆర్టీసీ డీపోల‌ను ఎత్తేసే ప్ర‌స‌క్తే లేదు
– గ్రామాల‌కు ఎల‌క్ట్రిక్ బ‌స్సులు న‌డిపే యోచ‌న
– సంస్థ‌ను బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యం
– తెలంగాణ ఆర్టీసీ ఎండి స‌జ్జ‌నార్
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆర్టీసీ డిపోలను ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పష్టం చేశారు. ఆదివారం వికారాబాద్ జిల్లాలోని ప‌రిగి ఆర్టీసీ డిపోను స‌జ్జ‌నార్ సందర్శించారు. డీపో నిర్వహణ తదితర వివరాలను ఆర్టీసీ కార్మికులకు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డిపోలు ఎత్తి వేస్తారని వదంతులు వస్తున్నాయని వాటిలో నిజం లేదన్నారు. పరిగి డీపో ఎత్తి వేస్తారన్న పుకార్లను కొట్టి పారేశారు. ప‌రిగి డీపోను ఎత్తివేయ‌డం జ‌ర‌గ‌ద‌న్నారు. పరిగి డిపో లాభాల బాటలో కొనసాగుతుందని మరింత లాభాల్లోకి తీసుకెళ్లేందుకు కార్మికులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వీఆర్ఎస్ తీసుకోవాలని ఏ కార్మికులపై ఒత్తిడి చేయడం లేదు అన్నారు. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే అందుకు కార్మికులు పని చేయాలని సూచించారు. ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాల‌ని, ఇత‌రులు కూడ వినియోగించుకునేలా చైత‌న్యం క‌ల్పించాల‌న్నారు. ఆర్టీసీ బ‌స్సుల్లో సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు.