ఆర్టీసీ కార్మికుల‌కు కోప‌మొచ్చింది..!

క్రైం తాండూరు వికారాబాద్

ఆర్టీసీ కార్మికుల‌కు కోప‌మొచ్చింది..!
– డీపో మేనేజర్‌పై సిబ్బంది ఆక్రోశం
– గంట‌ల పాటు డీపోలో నిలిచిన బ‌స్సులు
– చ‌ర్చ‌ల అనంత‌రం పున‌రుద్ద‌ర‌ణ
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డీపో ప‌నిచేస్తున్న కార్మికులకు కోప‌మొచ్చింది. సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఇద్ద‌రి కార్మికుల మ‌ద్య జ‌రిగిన పంచాయ‌తీని డీపో మేనేజ‌ర్ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపిస్తూ నిర‌స‌న చేప‌ట్టారు. ఈ కార‌ణంగా సోమ‌వారం ఉద‌యం నుంచి డీపోలోని బ‌స్సులు డీపోకే ప‌రిమితం అయ్యాయి.
అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకి వెళితే.. వికారాబాద్ బ‌స్ డీపోలో పీఆర్సీ రెడ్డి, సుద‌ర్శ‌న్‌లు కార్మికులుగా ప‌నిచేస్తున్నారు. ఇటీవ‌లే వీరి ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. దీంతో డీపో మేనేజ‌ర్ మ‌హేష్ వ‌ద్ద‌కు వెళ్లి ఒకరిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ పంచాయ‌తీలో డీపో మేనేజ‌ర్ సుద‌ర్శ‌న్‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇద్ద‌రి పంచాయ‌తీలో డీపో మేనేజ‌ర్ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించార‌ని కార్మికులు ఆందోళ‌న‌కు దిగారు. సోమ‌వారం ఉద‌యం నుంచి కార్మికులంతా విధులు బ‌హిష్క‌రించారు. ఇద్ద‌రి కార్మికుల గొడ‌వ, డీపో మేనేజ‌ర్ పంచాయ‌తి, కార్మికుల ఆందోళ‌న వ‌ల్ల ఆర్టీసీ బ‌స్సుల‌న్నీ డీపోకే ప‌రిమితం అయ్యాయి. ఇద్ద‌రి పంచాయ‌తిని న్యాయంగా ప‌రిష్క‌రించాల‌ని, అంత‌వ‌ర‌కు ఆందోళ‌న విర‌మించేది లేద‌ని కార్మికులు భీష్మించారు.  కొన్ని గంట‌ల త‌రువాత ఆర్టీసీ డీపో మేనేజ‌ర్, కార్మికుల మ‌ద్య స‌యోధ్య కుద‌ర‌డంతో వివాదం స‌మిసి పోయింది. చ‌ర్చలు ఫ‌లించిన త‌రువాత బ‌స్సులు రోడ్డెక్కాయి.