రేష‌న్ కార్డులో కొత్త స‌భ్యుల న‌మోదు

జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

రేష‌న్ కార్డులో కొత్త స‌భ్యుల న‌మోదు
– అవ‌కాశం క‌ల్పించిన ప్ర‌భుత్వం
– మీసేవాలో ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌
ద‌ర్శిని డెస్క్ : రేష‌న్ కార్డులో కొత్త స‌భ్యుల చేరిక కోసం ఎదురు చూస్తున్న ల‌బ్దిదారుల‌కు ప్ర‌భుత్వం మంచి అవ‌కాశం క‌ల్పించింది. స‌భ్యుల న‌మోదుకు మీసేవ కేంద్రాల ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పిస్తే నమోదు ప్ర‌క్రియ‌ను పూర్తిచేస్తామ‌ని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆధ్వ‌ర్యంలో రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి ల‌బ్దిదారునికి ఒక్కొక్క‌రికి 6 కిలోల చొప్పున రేష‌న్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. గ‌త యేడాది కొత్త రేష‌న్ కార్డుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి ఈ యేడాది కొత్త రేష‌న్ కార్డుల‌ను అందించింది. వారికి కూడ స‌భ్యుల ప‌రిమితి లేకుండా ఒక్కొక్క‌రికి 6 కిలోల చొప్పున రేష‌న్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఇంత‌కుముందు రేష‌న్ కార్డుల్లో పేర్లు న‌మోదు చేసే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఇబ్బుందుల‌కు గుర‌య్యేవారు. కొత్త‌గా వివాహాలు అయిన వారు, పిల్ల‌ల పేర్ల‌ను రేష‌న్ కార్డుల్లో న‌మోదు చేసేందుకు ఎంతో కాలంగా ల‌బ్దిదారులు ఎదురుచూస్తున్నారు. ల‌బ్దిదారుల నిరీక్ష‌ణ‌కు ప్ర‌భుత్వం తెర‌దించి కొత్త స‌భ్యుల న‌మోదుకు చేసుకునే వెసులుబాటును క‌ల్పిస్తోంది.

ఎలా న‌మోదు చేసుకోవాలంటే..
రేష‌న్ కార్డుల్లో కొత్త స‌భ్యుల న‌మోదు కోసం మీ సేవా కేంద్రాల్లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కొత్త‌గా న‌మోదు చేయాల‌నుకునే వారు కొత్త‌గా పెండ్లి అయిన స‌భ్యులు గాని, పిల్ల‌ల‌కు సంబంధించి గాని సంబంధికుల రేష‌న్ కార్డు నెంబ‌ర్‌తో పాటు కొత్త స‌భ్యుల ఆధార్ కార్డును జ‌త చేసి ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను రెవెన్యూ అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి న‌మోదుకు అనుమ‌తి ఇస్తారు.