గుండె పోటు గండం.. త‌ప్పించుకోండిలా..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ హైదరాబాద్

గుండె పోటు గండం.. త‌ప్పించుకోండిలా..!
– ఈ ల‌క్ష‌ణాల‌ను గుర్తించండి
– స‌కాలంలో స్పందిస్తే గ‌ట్టెక్కిన‌ట్లే
ద‌ర్శిని డెస్క్ : కాలంతో పోటీ ప‌డి ప‌రిగెత్తే జీవ‌నంలో గుండె పోటు మ‌న‌షుల‌ను హ‌డ‌లెత్తిస్తున్నాయి. ప్ర‌స్తుత బ్ర‌తుకు పోరాటంలో పెద్ద‌ల‌తో పాటు చిన్న‌వారిని కూడ గుండెపోటు ప‌ల‌క‌రిస్తోంది. ప్రాణాల‌ను తీస్తుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే మ‌న‌కు నిజంగా వస్తే ఏం చేయాలో అంద‌రు తప్పనిసరిగా తెలుసుకోవాలి. గుండెపోటు వచ్చినట్టు అనుమానం వస్తే కంగారు పడకుండా సకాలంలో ఆసుపత్రికి వెళ్లడానికి సిద్ధం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా గుండె ల‌య‌ను కాపాడుకునేందుకు తినే ఆహారంతో పాటు చేయాల్సిన వ్యాయామంపై దృష్టి పెట్టాలి. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయంటే
మ‌నిషికి గుండె పోటు స‌మ‌యంలో కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని వైద్యులు పేర్కొంటున్నారు. కొన్ని సంద‌ర్భాల‌లో అందరికీ ఒకే రకమైన లక్షణాలుండవని స్ప‌ష్టం చేస్తున్నారు. గుండె పోటుకు ముందు ఛాతీలో నొప్పి రావ‌డం, చేయి లాగినట్టు ఉండటం క‌నిపిస్తోంది. దడ, ఆయాసం వస్తుంది. వీటితో పాటు బాగా చెమట పడుతుంది. అంతేకాకుండా గుండెలో మంట‌తో పాటు దవడనొప్పి ఉంటుంది. వికారంగా ఉంటుంది. వాంతులు కూడా అవుతాయి.

ఎలా ఉంటుందంటే…
ఏదో ఒక రక్తనాళం ఆకస్మాత్తుగా మూసుకొని పోవడంతో గుండెపోటు వస్తుంది. దానితో గుండెలో ఒక భాగానికి రక్త సరఫరా ఆగిపోతుంది. గుండెపోటు వచ్చినపుడు ఎంత త్వరగా ఆసుపత్రికి వెళితే అంత మంచిది. లేకపోతే గుండె కండరాలు చచ్చుబడిపోతాయి.

ఏం చేయాలంటే..
ఏదైనా పని చేస్తున్నపుడు గుండెపోటు వస్తే వెంటనే చేస్తున్న పని ఆపేయాలి. విశ్రాంతి తీసుకోవాలి. అనుమానం ఉన్నపుడు సొంతంగా వాహనాన్ని నడుపుకొంటూ వెళ్లొద్దు. వీలైతే 108కి ఫోన్‌ చేయాలి. లేదంటే స్నేహితులకు సమాచారం ఇవ్వాలి. గుండె సమస్య ఉన్నవారయితే సార్బిట్రేట్‌ ట్యాబ్లెట్‌ను నాలుక కింద పెట్టుకోవచ్చు. అనుమానం ఉన్న వారు వాడితే బీపీ తగ్గిపోయి పడిపోవచ్చు. సీపీఆర్‌ను గుండె ఆగిపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నపుడు చేయొచ్చు.