కార్మికుల పక్షాన నిరంతర పోరాటం
– హక్కులను కాలరాస్తే ఊరుకునేదిలేదు
– వేతనాలను చెల్లించకుంటే సమ్మె తప్పదు
– ఏఐటీయూసీ జెండా ఆవిష్కరణలో నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: కార్మికుల పక్షాన ఏఐటీయూసీ నిరంతర పోరాటం చేస్తుందని జిల్లా నాయకురాలు విజయలక్ష్మీ పండిత్ అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏఐటీయూసీ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. జిల్లా నాయకురాలు విజయలక్ష్మీ పండింత్ ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల పక్షాన ఏఐటీయూసీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. తాండూరు మున్సిపల్ కార్మికుల పట్ల అధికారులు, పాలకులు చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. వారి న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని, పెంచిన వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను నెరవేర్చకపోతే సమ్మెకు దిగడం ఖాయమని, ఇప్పటికే నోటీసులను అందజేయడం జరిగిందని గుర్తుచేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, తాండూరు మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గోరేప్ప, గోపాల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

