సర్వమత సంక్షేమమే సర్కారు ధ్యేయం
– అన్ని పండగలకు సమ ప్రాధాన్యం
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– తాండూరులో అట్టహాసంగా దుస్తుల పంపిణీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : సర్వమత సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కారు కృషి చేస్తోందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు మండలం, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్ మండలాలకు చెందిన క్రైస్తవులకు కొత్త దుస్తుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హాజరై జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తదితరులతో కలిసి క్రైస్తవులకు కొత్త దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాతే రాష్ట్రంలో అన్ని పండగలకు సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు. రంజాన్, బతుకమ్మ, క్రిస్మస్ పండగలను ఘనంగా నిర్వహిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో క్రైస్తవులకు భారీ భవనం నిర్మిస్తుందన్నారు. సర్వమత సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న తెలంగాణ సర్కారు క్రైస్తవుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు విజయ దేవి, అబ్దుల్ రజాక్, ఆసిఫ్, బోయరవి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, వివిధ గ్రామాల పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

