డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లపై ఏం జరిగింది..?

తాండూరు రాజకీయం వికారాబాద్

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లపై ఏం జరిగింది..?
– ఎంపిక, పంపిణీ వివరాలను అందించాలి
– కలెక్టర్‌కు ఆర్టీఐ దరఖాస్తు చేసిన కౌన్సిలర్ జావిద్
– ప్రభుత్వ ఆసుపత్రిపై ఎమ్మెల్యే బదులివ్వాలి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ ప్రక్రియపై పూర్తి వివరాలు వెల్లడించాలని తాండూరు మున్సిపల్ 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎం.డి. జావిద్ డిమాండ్ చేశారు.

బుధవారం వికార్‌బాద్ జిల్లా కలెక్టర్‌కు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు సమర్పించారు. ఇందులో తాండూరు నియోజకవర్గంలో మొత్తం ఎన్ని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయి, వాటి నిర్మాణం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు పూర్తయింది, ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారనే వివరాలను కోరారు. అలాగే 581 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించేందుకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, అర్హుల ఎంపికకు అనుసరించిన ప్రమాణాలు, తుది జాబితా, పంపిణీ తేదీలు తదితర వివరాలను అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇళ్ల కేటాయింపులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో జరిగిన పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలు, ఏ కాలంలో ఎన్ని ఇళ్లు కేటాయించారో తెలియజేయాలని కోరారు. అదేవిధంగా లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన దరఖాస్తులు, పరిశీలన నివేదికలు, అర్హత ప్రమాణాలు, సీఏపీఏ(కరెక్టివ్ అండ్ ప్రీవెంటివ్ యాక్షన్‌) కమిటీ ఏర్పాటు జరిగిందా లేదా, కమిటీ ఉంటే దాని నివేదికలు, సమావేశాల వివరాలు కూడా అందించాలని ఆర్టీఐలో ప్రశ్నించారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ ప్రక్రియలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సమాచారాన్ని కోరుతున్నట్లు కౌన్సిలర్ జావిద్ తెలిపారు. దీనిపై సరైన సమాధానం రాకపోతే హైకోర్టుకు వెళతామని అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇలాఖాలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల వ్యవహారంతో చేస్తున్న రాజకీయ కుట్రలను బహిర్గం చేస్తామని అన్నారు. అదేవిధంగా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బదులివ్వాలని డిమాండ్ చేశారు.

దత్తాత్రేయ సేవలో విఠల్ నాయక్