గిన్నిస్ బుక్ ఎక్కేలా కంటి వెలుగు-2
– రూ. 250 కోట్లు, 1500ల బృందాలు
– సర్వం సిద్దం చేస్తున్న సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: అంధత్వ నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటివెలుగు-2 కార్యక్రమాన్ని ప్రవేశ పెడుతోంది. ఎక్కడా లేని విధంగా చేపడుతున్న కంటి వెలుగు-2తో సర్కారు గిన్నిస్ బుక్ రికార్డుపై కన్నేసింది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు పేర్కొంటున్నారు. ఈనెల 18 నుంచి తెలంగాణలో కంటి వెలుగు రెండో దశ ప్రోగ్రామ్‌కు రంగం సిద్ధమైంది. జూన్ 30వరకు వంద రోజుల పాటు ఇది కొనసాగనుంది. మొదటి దశలో కోటిన్నర మందికి పరీక్షలు చేసి 50లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. రూ. 250 కోట్లతో కంటి వెలుగు-2 ప్రారంభమవుతుందని, 15వందల టీమ్స్, 15వందల వెహికల్స్ ఏర్పాటు చేసినట్టు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం చేశారు. ఇందుకు అవసరమైన సామగ్రి, రీడింగ్ కళ్లద్దాలను జిల్లాల వారిగా పంపేందుకు చర్యలు చేపట్టారు. పీహెచ్‌సీ ద్వారా బృందాలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పరీక్షల అనంతరం రీడింగ్ కళ్లద్దాలు, అదేరోజు, డిస్టెన్స్ స్పెసిఫిక్ కళ్లద్దాలు 15 రోజుల్లో సంబంధిత ప్రజలకు అందజేసేలా దృష్టి సారిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండోదశ ప్రోగ్రామ్‌తో కంటి వెలుగు కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లోకి ఎక్కుతుందని రాష్ట్ర మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

