చైల్డ్ లైన్ ఎర్ర వెంకటేష్ ఇకలేరు
– గుండెపోటుతో అకాల మరణం
– విచారం వ్యక్తం చేసిన ప్రముఖులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: చైల్డ్ లైన్ 1098 తాండూరు డివిజన్ కోఆర్డీనేర్ ఎర్ర వెంకటేష్(45) ఇకలేరు. గురువారం రాత్రి గుండెపోటుకు గురై అకాల మరణం చెందారు. తాండూరు మండలం నారాయణ పూర్ ఎంపీటీసీ నర్సమ్మ కుమారుడు ఎర్ర వెంకటేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన చైల్డ్ లైన్ 1098 తాండూరు డివిజన్ కోఆర్డీనేటర్‌గా పనిచేశారు. అంతకుముందు ఎంవీఎఫ్(మామిడిపూడి వెంకటయ్య ఫౌండేషన్)లో సేవలందించారు. ఎందరో బాల కార్మికులకు విముక్తి కల్పించడంలో కీలకంగా పనిచేశారు. అయితే గురువారం రాత్రి 11 గంటల సమయంలో చాతిలో నొప్పి రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశారు. ఆయన స్వగ్రామం తాండూరు మండలం వీర్ శెట్టిపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు ఎర్ర వెంకటేశం మరణం పట్ల ప్రజా సంఘాల నాయకులు, ప్రముఖులు, విద్యావేత్తలు, నాయకులు విచారం వ్యక్తం చేస్తూ కుటుంబానికి సానుభూతిని తెలిపారు.

