భస్మం అయిన జిప్పం కర్మాగారం.!

క్రైం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

భస్మం అయిన జిప్పం కర్మాగారం.!
– గుంతబాస్పల్లి సమీప ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
– మంటలు ఆర్చిన తాండూరు, కర్ణాటక ఫైర్ స్టేషన్ల సిబ్బంది
– మూడు గంటల తరువాత చల్లారిన అగ్ని కీలలు
– ప్రకృతి ప్రకోపించే శిక్షించిందన్న గ్రామాల ప్రజలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలంలోని జిప్సం కర్మాగారం అగ్ని ప్రమాదానికి భస్మం అయ్యింది. భారీ అగ్ని ప్రమాదం సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు మూడు గంటల పాటు తాండూరు, కర్ణాటకకు చెందిన ఫైర్ స్టేషన్ల సిబ్బంది కష్టపడి మంటలను ఆర్పేశారు. ఈ సంఘటన శుక్రవారం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం గుంతబాస్పల్లి గ్రామ సమీపంలో ఇండస్ చెమ్ హజార్ డోస్ జిప్పం కర్మాగారం కొనసాగుతోంది. ఈ కర్మాగారం నుంచి వెదజల్లుతున్న కాలుష్యంపై అనేక అభియోగాలు ఉన్నాయి. అయితే శుక్రవారం మధ్యాహ్న సమయంలో ప్రమాద వశాత్తు కర్మాగారం నుంచి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కర్మాగారంలో బయట ఉన్న సల్ఫర్ యాసిడ్ సిలిండర్లు పేలుడు వల్ల కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంబవించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కర్మాగారం నుంచీ భారీ ఎత్తున పొగలు వ్యాపించడంతో పాటు పెద్దగా దుర్వాసన వెదజల్లడంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. మరోవైపు అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న తాండూరు అగ్నిమాపక కేంద్ర అధికారి నాగార్జున తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చే రుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు పూర్తిగా ఎగిసి పడడంతో అదుపు చేయడం సాధ్యపడలేదు. వెంటనే కర్ణాటకకు చెందిన ఫైర్ స్టేషన్ నుంచి ట్యాంకర్ను తెప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.

ప్రకృతి ప్రకోపమే అన్న గ్రామాల ప్రజలు
జిప్పం కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించడంపై సమీపంలో ఉన్న గుంతబాస్పల్లి, ముల్కాపూర్, కరణ్ కోట్, కోటబాస్పల్లి తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. ఈ కర్మాగారం కాలుష్యంపై గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్నారు. శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంతో ప్రకృతి ప్రకోపించడం వల్లే జరిగిందని శాపనార్థాలు పెట్టారు. కర్మాగారం కాలుష్యం వల్ల పంటలు నాశనమవుతున్నాయని. సాగు.. తాగునీరు కలుషితం అవుతున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు. కర్మాగారంపై దేవుడు సరైన శిక్ష వేశాడని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.