ప్రజావాణికి స్పందన

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రజావాణికి స్పందన
– మున్సిపల్‌లో 28 ఫిర్యాదులు
– అధికంగా అసరా ఫించన్ కంప్లైంట్స్‌
– పరిష్కార చర్యలు తీసుకుంటామన్న అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి స్పందన లభించింది. సోమవారం ఉదయం 10-30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ రంగనాథం, టౌన్‌ ప్లానింగ్ అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, టౌన్ ప్లానింగ్, అసరా ఫించన్లపైనే ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని అధికారులు ముందే తెలపడంతో ప్రజలు ఆ సమస్యలపైనే ఫిర్యాదులు సమర్పించారు. మధ్యాహ్నం వరకు కొనసాగిన ప్రజావాణిలో మొత్తం 28 ఫిర్యాదులు అందినట్లు మేనేజర్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఇందులో అత్యధికంగా అసరా ఫించన్లకు సంబంధించి 25 ఫిర్యాదులు అందాయని తెలిపారు. కొత్త ఫించన్లతో పాటు ఇంట్లో ఒక్కరికే అందిస్తున్న ఫించన్‌ విధానంలో భర్త చనిపోతే.. వారి స్థానంలో భార్యకు ఫించన్ అందించాలనే ఫిర్యాదులు చేసుకున్నారని వివరించారు. పారిశుద్ధ్యానికి సంబంధించి ఒక ఫిర్యాదు అందిందని, టౌన్‌ ప్లానింగ్‌కు సంబంధించి రెండు ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. ఫిర్యాదులను సంబంధించిన శాఖలకు ఫార్వర్డ్ చేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇనుస్పెక్టర్‌ ఉమేష్‌ కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.