ఫ్యామిలోలో ఒక్కరే అర్హులు..!
– ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల వడబోత
– స్థలం, సాయం ఎలా అందించాలి కసరత్తు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్దిదారులను ఎంపిక చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఆరు గ్యారెంటీలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 84 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల వడపోత ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని, స్థలం లేనివారికి స్థలం కేటాయించడంతోపాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని కాంగెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ప్రస్తుతం కేవలం ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం వచ్చిన దరఖాస్తులను, రెండింటి కోసం వచ్చిన దరఖాస్తులను వేరుచేస్తున్నారు. కొంతమంది వేర్వేరు ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకున్నట్లు, ఒకే కుటుంబానికి సంబంధించి ఒకటికి మించి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరినే అర్హులుగా ఎంపిక చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే పెళ్లిళ్ల తరవాత ఉమ్మడి కుటుంబంగా ఉన్నవారికి మాత్రం ఈ నిబంధనను వర్తింపజేయరని సమాచారం. దరఖాస్తుల వడపోత అనంతరం గ్రామసభలు నిర్వహించి అర్హులను గుర్తించాలని సర్కారు యోచిస్తోంది. ఏడాదికి ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేయాలి.. ఎన్ని నిధులు కేటాయించాలన్న అంశాలపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ప్రణాళికను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అర్హులను గుర్తించిన తర్వాత ఎన్ని నిధులు అవసరమన్న అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. కుప్పులుగా వచ్చిన దరఖాస్తుల్లో ఒక వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడెక్కడ దరఖాస్తు చేశారో తెలుసుకునేందుకు దరఖాస్తుదారుల ఆధార్ నంబర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతను వినియోగించి అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆయా దరఖాస్తుదారులను సంప్రదించి వారు కోరుకున్న చోట ఆమోదం తెలిపి.. మిగిలిన దరఖాస్తులను తిరస్కరించేలా సర్కారు చర్యలు చేపడుతోంది.
ఇదికూడా చదవండి…

