మున్సిపల్‌లో ప్రైవేటు లైబ్రరీ..!
– ఏర్పాటుకు అధికారుల కసరత్తు
– పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయోగం
– కలెక్టర్, ఎమ్మెల్యే సూచనలతో సదుపాయాలపై దృష్టి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో నిరుపయోగంగా ఉన్న పాత మున్సిపల్ భవనంలో ప్రైవేటు లైబ్రరీని ఏర్పాటు చేయబోతున్నారు. జిల్లా కలెక్టర్, తాండూరు ఎమ్మెల్యే సూచనలతో ప్రైవేటు లైబ్రరీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడే ఎందుకోసం అంటే.. తాండూరు పట్టణానికి చెందిన సతీష్ అనే న్యాయవాది హైదరాబాద్‌లో ఐఏస్, ఐపీఎస్ ఉద్యోగాలతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు.
అయితే తాండూరులోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు నిర్వహించాలని భావించారు. ఇందుకు తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయానికి కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మున్సిపల్‌లో ఏర్పాటు చేసే ప్రైవేటు లైబ్రరీ కోసం కావాల్సిన సదుపాయాలను కల్పించాలని భావించారు.
ఇప్పటికే మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఇంచార్జ్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిలు కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో టాయిలెట్లు, బాత్‌రూంలు, తాగునీరు వంటి సదుపాయాలను కల్పించే పనిలో పడ్డారు. త్వరలోనే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రైవేటు లైబ్రరీ అందుబాటులోకి వస్తే స్థానిక నిరుద్యోగ యువతకు మంచి ఉపయోగం కలుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదికూడా చదవండి…

