ధాన్యం సేకరణకు సర్వం సిద్దం

తాండూరు రాజకీయం వికారాబాద్

ధాన్యం సేకరణకు సర్వం సిద్దం
– 3 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోల్లే లక్ష్యం
– నవంబర్ 3 నుంచి ధాన్యం సేకరణ
– జిల్లాలో 121 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
– రెండు రోజుల్లోనే రైతుల ఖాతాలోకి చెల్లింపులు
– వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ కె.నిఖిల
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేస్తోంది. సర్కారు ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ కె.నిఖిల నేతృత్వంలో కొనుగోళ్ల ప్రక్రియపై నిర్వహకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. బుధవారం మడ్గుల చిట్టంపల్లిలోని డీపీఆర్సీ భవన్‌లో వానాకాలం ధాన్యం కొనుగోలు పై నిర్వాహకులకు నిర్వహించిన శిక్షణా తరగతులను కలెక్టర్ నిఖిల సందర్శించి సూచనలు చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే నెల నవంబర్ 3 నుంచి జిల్లాలో ధాన్యం సేకరణ ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 121 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈసారి వ్యవసాయ శాఖ అధికారుల అంచనా మేరకు జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ధాన్యం సేకరించిన రైతులకు రెండు రోజుల్లో చెల్లింపులు జరిగేలా దృష్టిసారించడం జరిగిందన్నారు.

అవకతవకలు జరిగితే క్రిమినల్ కేసులు
జిల్లాలో ధాన్యం సేకరణ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ నిర్వహకులకు సూచించారు. వరి ధాన్య సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దృష్టిసారించాలన్నారు. కొనుగోళ్లలో ఎటువంటి లోపాలు జరిగితే వరి ధాన్య సేకరణ కేంద్రాల ఇంచార్జులు, వ్యవసాయ విస్తరణ అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు పూర్తి బాధ్యతతో పారదర్శకంగా పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. రైతులు ఉన్నప్పుడు వారి సమక్షంలోనే వరి ధాన్యం తూకం చేయాలని, రైతుల నుండి ధాన్యాన్ని సేకరించిన రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర మేరకు నగదు వారి ఖాతాలో చేరే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధన ప్రకారం నాణ్యత ప్రమాణాల మేరకు ధాన్యాన్ని తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడవకుండా ఉండేందుకు 20 టార్ పాలిన్ (తాడుపత్రి) లను, ధాన్యం క్లీనింగ్ మిషన్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. రైతుల వివరాలను, ధాన్యం సేకర వివరాలను టాబ్ లలో పొందుపరచాలని సూచించారు. వరి ధాన్య సేకరణకు అవసరమైన గోనెసంచులను అందుబాటులో ఉన్నాయని అన్నారు. వరి ధాన్యం సేకరణకు ప్రతి కేంద్రం నుండి రెండు లారీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా లారీల నంబర్లు, డ్రైవర్ల ఫోన్ నెంబర్లు కూడా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.

అదనపు ధాన్యం నిల్వలకు గోదాంల గుర్తింపు
అయితే జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు లక్ష్యానికి అనుగుణంగా చర్యలు చేపట్టడం జరగుతుందని కలెక్టర్ అన్నారు. రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ కు మిల్లర్లు ముందుకు వచ్చారని, అదనంగా వచ్చే ధాన్యం నిలువలకు గోదాములను గుర్తించడం జరిగిందని అన్నారు. మరోవైపు వానాకాలం 2002-23 వరి పంటకు సంబంధించి మద్దతు ధర గోడ ప్రతికను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేశ్వర్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ విమల, డీఆర్డీఓ కృష్ణన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలేశ్వర్ గుప్తా, మిల్లర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.