సూప‌ర్ లేడీ కానిస్టేబుల్

క్రైం జాతీయం

సూప‌ర్ లేడీ కానిస్టేబుల్
– రైలు కింద‌పడుతున్న మ‌హిళ‌ను వైనం
– నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న వీడియో
ద‌ర్శిని బ్యూరో: ఆమె మెరుపు వేగం సూప‌ర్‌… ఆక‌ట్టుకున్న స‌మ‌య స్పూర్తి.. అబ్బురం.. అద్బుతం.. అంటూ ఓ మ‌హిళ కానిస్టేబుల్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు నెటిజ‌న్లు. ఇంత‌కీ ఆమె చేసిన సాహాసం గురించి తెల‌స్తే మీరు అదే చేస్తారు. వివ‌రాల్లోకి వెళ్లితే… మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శాండ్‌హర్స్ట్‌రోడ్ స్టేషన్ ప‌రిధిలో సప్నా గోల్కర్ అనే మ‌హిళ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఆమె విధులు నిర్వ‌హిస్తున్న స్టేష‌న్‌కు 50 ఏళ్ల మహిళా ప్యాసింజర్ బద్లాపూర్ వెళ్తోన్న లోకల్ ట్రైన్ లోని మహిళా జనరల్ కోచ్‌లోకి ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. అయితే, ఈ క్రమంలో ఆమె ట్రైన్ ఎక్కుతూ కిందపడిపోయింది. అయితే, సదరు మహిళా ప్రయాణీకురాలు రైలు కదలడం ప్రారంభించగానే దాన్ని ఎక్కడానికి ప్రయత్నించడాన్ని కొంచెం దూరంలో ఉన్న మహిళా కానిస్టేబుల్ సప్నా గోల్క‌ర్ గ్రహించింది. ప్ర‌మాదాన్ని ముందే గ్రహించిన ఆమె మెరుపు వేగంతో ప్రయాణీకురాలి దగ్గరకి వెళ్లింది. ప‌ట్టాల కింద‌కు దూసుక‌పోతున్న మ‌హిళ‌ను గట్టిగా వెనక్కిలాగేసి ఆమె ప్రాణాల‌ను కాపాడింది. బ్ర‌తుకు జీవుడా అంటూ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన మ‌హిళ లేడీ కానిస్టేబుల్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ దృశ్యాలు స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సెంట్రల్ రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మహిళను పెద్ద ప్రమాదం నుంచి రక్షించిన లేడీ కానిస్టేబుల్ సమయస్పూర్తికి రైల్వే వర్గాలే కాదు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, నెటిజన్లు సైతం మహిళా కానిస్టేబుల్‌కు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారడమేకాదు, సప్నా గోల్కర్ ను సెలబ్రెటీని చేసేసింది.