అంతారం సర్పంచ్‌పై చర్యలు తీసుకోండి
– జిల్లా కలెక్టర్, డీపీఓలకు వార్డు సభ్యుల ఫిర్యాదు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం అంతారం గ్రామ సర్పంచ్ రాములుపై చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డు సభ్యులు కోరారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్, డీపీఓలకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ రాములు రాజకీయ పలుకుబడితో గ్రామంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వార్డు సభ్యులకు సమాచారం
ఇవ్వకుండా సమావేశాలు నిర్వహించి.. ఏకపక్షంగా తీర్మానాలు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతలేకుండా.. నాసిరకంగా చేపడుతున్నారని అన్నారు. దీనిపై అడిగితే నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా.. ఏవరికైనా చెప్పుకోండి అని దురుసుగా బదులిస్తున్నారని అన్నారు. ఇంకా ముందుకెళ్లి ప్రశ్నించిన వారిపై బెధిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కావున సర్పంచ్ రాములుపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, డీపీఓలకు అందించిన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఫిర్యాదును అందించిన వారిలో వార్డు సభ్యులు ఎల్. రాజేందర్‌రెడ్డి, వసీం, దుర్గమ్మ, పద్మమ్మ, లక్ష్మమ్మ, నరసమ్మ, మల్లేశ్వరిలతో పాటు తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు అంబ్రేష్ ఉన్నారు.


